మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తున్న వీరు ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్‌లను ఈ నెల 13వ తేదీలోపు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇచ్చిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఈడీ నోటీసులపై శిల్పా శెట్టి దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే విధించింది.
కోర్టులో వాదనల సందర్భంగా శిల్పా శెట్టి తరపు న్యాయవాది తన వాదలను వినిపిస్తూ, 2017లో జరిగిన 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, పైగా, ఇది ఈడీ పరిధిలో లేని అంశమని, అయినప్పటికీ ఈ కేసులో నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు వారు ఈడీ విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది.
కాగా, ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ముంబైకి చెందిన 'వేరియబుల్ ప్రైవేట్' అనే సంస్థ 2017లో 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'ను నిర్వహించింది. బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం వరకు లాభాలు వస్తాయని ఆశ చూపింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ విధానంలో ఢిల్లీ, ముంబైలో రూ. 6,600 కోట్లను వసూలు చేసింది.
ఈ సంస్థ మోసం బయటపడటంతో దాని ప్రమోటర్లపై. ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. ఈ స్కీమ్‌లో మాస్టర్ మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్ కాయిన్లను కొనుగోలు చేశారని,. ఇప్పటికీ అవి ఆయన వద్దే ఉన్నాయని ఈడీ తెలిపింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి దంపతులకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.