భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి దిలీప్ కుమార్ మన్ సుఖ్ లాల్ గాంధీ (69) కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఇటీవల ఆయన వ్యక్తిగత పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అక్కడాయనలో కరోనా లక్షణాలు బయటపడగా వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయన మృతి విషయాన్ని వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో దిలీప్ గాంధీ నౌకాయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోక్‌సభ సభ్యునిగా గతంలో ఆయన ఎన్నికయ్యారు. గాంధీకి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దిలీప్ గాంధీ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.
ఇదిలావుండగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఎంపీ, బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ (62) ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆయన తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తమకు ఫోను చేసి చెప్పాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి వెళ్లి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
అక్కడ పలు ఆధారాలను సేకరించిన పోలీసులు అనంతరం... పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని గోంతీ అపార్ట్‌మెంట్స్ నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్కడకు చేరుకుని పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.