ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు మరోమారు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భారీ ఎన్‌కౌంటరులో 18 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతదేహాలను గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ యేడాది బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు ఇదే అతిపెద్ద నష్టమని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో మవోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై తుపాకీ కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బగలగాలు ఎదురు కాల్పులు జరపడంతో 18 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతదేహాల్లో బుధవారం 12 శవాలను స్వాధీనం చేసుకోగా, గురువారం మరో ఆరు మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 18కి చేరింది.
అయితే, మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మోహన్ బడ్డి, కానిస్టేబుల్ డుకారు గోండే, జవాన్ రమేశ్ సోడీ కూడా మరణించారు. వారి మృతదేహాలను బీజాపూర్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించి, ఉన్నతాధికారులు తోటి జవాన్లు ఘనంగా నివాళులు అర్పించారు. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సింగ్ మీనా వెల్లడించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన, సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.