బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలి దశ పోలింగ్ ఈ నెల 28వ తేదీన 16 జిల్లాల్లో 71 అసెంబ్లీ స్థానాల్లో జరుగనుంది.
ఈ దశ ఎన్నికల కోసం జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఇరానీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఎన్డీయే తరుఫున ప్రచారం నిర్వహించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మహాకూటమి తరపున ప్రచారం చేశారు. అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల హామీలు, ఇతర పార్టీలపై విమర్శలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి. నవంబర్ 3న రెండో దశ, 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్ 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇదిలావుంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులకు ఊహించని పరాభవాలు ఎదురయ్యాయి. మొన్న ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. సోమవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అదే చేదు అనుభవం ఎదురైంది.
ముజఫర్ పూర్‌లో ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాప్టర్ వద్దకు వస్తుండగా కొందరు చెప్పులు విసిరారు. అయితే అవి ఆయనకు తగలలేదు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఎన్నికల్లో నితీశ్‌కు అసహనం ఎక్కువవుతోంది. ఆయన సభలలో వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. దీంతో, నిరసనకారులపై నితీశ్ మండిపడుతున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ, ఓట్లు వేయకున్నా ఫర్వేదంటూ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.