Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గేల్ - మన్‌దీప్ వీరవిహారం.. కోల్‌కతా చిత్తు... పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం

గేల్ - మన్‌దీప్ వీరవిహారం.. కోల్‌కతా చిత్తు... పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (10:31 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు డాషింట్ ఆటగాడు క్రిస్ గేల్ వీరవిహారం చేయడంతో కోల్‌కతా జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 
 
ఈ మ్యాచ్‌కు ముందు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే పంజాబ్ ఖచ్చితంగా గెలిచితీరాల్సివుంది. దీంతో విజయే లక్ష్యంగా ఆ జట్టు బరిలోకి దిగింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పంజాబ్ బౌలర్లు కోల్‌కతాను 149 పరుగులకే కట్టడి చేయగా, లక్ష్య ఛేదనలో గేల్, మన్‌దీప్ సింగ్ చెలరేగిపోవడంతో పంజాబ్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఫలితంగా 12 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, ఇప్పటి రకు ఆ స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి దిగజారింది.
 
అంతకుముందు కోల్‌కతా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 57, కెప్టెన్ మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40, లాకీ పెర్గ్యూసన్ 13 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ తో 24 పరుగులు చేశారు. నితీశ్ రాణా, కార్తీక్ డకౌట్ కాగా, మిగతా వారు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం గగనమైపోయింది. ఫలితంగా 149 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీసుకోగా, జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ నేల కూల్చారు.
webdunia
 
ఆ తర్వాత 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు... 18.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ (28) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ వీర విహారం చేస్తూ కోల్‌కతా బౌలర్లను చితకబాదాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి విజయానికి మూడు పరుగుల ముందు అవుటయ్యాడు. 
 
మరోవైపు క్రీజులో కుదురుకున్న మన్‌దీప్ సింగ్ కూడా బ్యాట్ ఝళిపించాడు. బౌండరీలతో విరుచుకుపడ్డారు. 56 బంతులు ఎదుర్కొన్న మన్‌దీప్ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ధనాధన్ ఇన్సింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన క్రిస్‌గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ శర్మకు మొండిచేయి... సిరాజ్‌కు లక్కీఛాన్స్.. రాహుల్‌కు ప్రమోషన్...