బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకుని మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఖాతా తెరిచింది. ఒక్క సీటు గెలుచుకుని విజయభేరీ మోగించింది. ఆ గెలుపు కూడా కేవలం 30 ఓట్ల తేడాతో దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకుగాను 192 స్థానాల్లో మాయావతి పార్టీ బరిలోకి దిగింది. ఒకే ఒక్క సీటు మాత్రమే ఈ పార్టీ దక్కించుకోగలిగింది. ఆ పార్టీకి చెందిన సతీష్‌కుమార్ యాదవ్ రామ్‌గఢ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో ఇక్కడ హోరాహోరీగా కొనసాగింది. అర్థరాత్రి వరకు ఇది జరిగింది.
ఓట్ల లెక్కింపు సమయంలో సతీష్ ఎక్కువగా ఆధిక్యంలోనే నిలిచారు. కౌంటింగ్ కొనసాగేకొద్దీ ఇది మారుతూ వచ్చింది. చివరిగా 72,689 ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థిగా భాజపా నుంచి బరిలోకి దిగిన అశోక్‌కుమార్ సింగ్ 72,659 ఓట్లను సాధించారు. వీరి మధ్య కేవలం 30 ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉండటం గమనార్హం. తర్వాత స్థానాల్లో ఆర్జేడీ, ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ(జేఎస్పీ) పార్టీ అభ్యర్థులు నిలిచారు.
రామ్‌గఢ్ ఆర్జేడీకి కంచుకోటగా ఉండేది. 2005 నుంచి ఈ ప్రాంతం ఆర్జేడీ- భాజపాల మధ్య గట్టి పోటీ ఇచ్చింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఈ స్థానాన్ని 189 ఓట్ల తేడాతో ఆర్జేడీ చేతిలో ఓడిపోయింది. 2024 ఉప ఎన్నికల్లోను పరాజయం పాలైంది. ఆ ప్రాంతంలో బీఎస్పీ ఇప్పుడు విజయం దక్కించుకోవడం గమనార్హం.