మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు.
అగ్నిప్రమాద ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. 36 మంది చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.