కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు సూచించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ నిరసనను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని రంగాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి.
అలాగే, ఏపీలో ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్‌కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.
27న మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఏపీలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 27న భారత్ బంద్‌కు ఏఐసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ విజయవంతం చేయాలనీ, ప్రతి కార్యకర్త, అభిమాని పాల్గొనాలనీ పిలుపు నిచ్చాయి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ కమిటీలు. టీడీపీ కూడా భాగస్వామ్యం అవుతుంది.