ప్రభుత్వాధికారులపై అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చిత్తూరు జిల్లాలో జరిగింది. అదీకూడా నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా. ఈమె అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు కంటతడిపెట్టారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ వైకాపా నేతల్లోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దీంతో ఎంపీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపిపి చేయాలని ప్రయత్నిస్తుండగా… రోజా ప్రత్యర్థి వర్గం అయిన రెడ్డివారి భాస్కర్ రెడ్డి ఎంపీపీ పదవి కోసం పోటీపడ్డారు.
ఇది రోజాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఆమె అధికారుల పట్ల ఎమ్మెల్యే రోజా దురుసుగా ప్రవర్తించడంతో రిటర్నింగ్ అధికారి కంటతడిపెట్టారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అధికారులను బెదిరించారు.
నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో ఎమ్మెల్యే రోజా వాదనకు దిగారు. అంతేకాదు తన ప్రత్యర్థి వర్గం మొత్తం టీడీపీ కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవకు దిగారు.