ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... మహిళలపై దాడులు ఆగడంలేదు. ఏదో ఒకచోట స్త్రీలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. బెంగళూరులో మహిళపై ఓ దుండగుడు అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోసి ఆ తర్వాత ఆమె శరీరంపై విచక్షణారహితంగా పొడిచి హత్య చేసాడు. బెంగళూరులోని కోరమంగళలో పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో బీహార్‌కు చెందిన మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నేరానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండగుడు జూలై 23 రాత్రి 24 ఏళ్ల కృతి కుమారిని దొంగచాటుగా హత్య చేసి చంపాడు.
బాధితురాలు మరో మహిళతో ఉంటున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కృతి కుమారి రూమ్‌మేట్ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ నుండి వెళ్లిపోయింది. కృతి కుమారితో కలిసి వుంటున్న ఆ యువతిని ప్రేమిస్తున్న వ్యక్తి.. తన ప్రియురాలు తనకు దక్కకుండా వెళ్లిపోవడం వెనుక ఈమె కారణం అని కక్ష పెంచుకున్నాడు. దానితో ఆ వ్యక్తి పాలిథిన్ బ్యాగ్ పట్టుకుని పేయింగ్ గెస్ట్ కారిడార్‌లోకి వెళ్లాడు. అనంతరం తలుపు తట్టడంతో ఆమె తలుపు తీసింది. వెంటనే ఆ మహిళను బయటకు ఈడ్చుకొచ్చాడు. బాధితురాలు దాడిని ప్రతిఘటించింది, కానీ వెంటనే హంతకుడు ఆమె గొంతు కోసి విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు.
బాధితురాలి ఆర్తనాదాలు విని పేయింగ్ గెస్ట్‌లలోని ఇతర మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ వారు ఆమెను రక్షించలేకపోయారు. కృతి కుమారి బీహార్‌కు చెందినది. ఆమె నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ సంఘటన జూలై 23 రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. కాగా హత్య చేసిన తర్వాత నిందితుడు అభిషేక్ తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో వెంటనే ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కృతి రూమ్‌మేట్‌కి అభిషేక్‌కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారు. తన ప్రియురాలు తన నుంచి దూరం కావడానికి కృతియే కారణమని అభిషేక్ భావించడం వల్లనే అతడు కృతిని టార్గెట్ చేశాడని తేలింది.
మరోవైపు నిందితుడు అభిషేక్ రాత్రి 11 గంటల తర్వాత మహిళలు వుంటున్న ఆ భవనంలోకి ఎలా ప్రవేశించగలిగాడనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి, అక్కడ నివసించే మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీజీ యజమానిపై కూడా కేసు నమోదు చేయబడింది.