వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలను భారీగా నిల్వ చేశారంటూ ప్రచారం సాగింది. ఈ విషయంపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఇవి చర్చనీయాంశంగా మారాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సోమవారం రాజ్‌భవన్ భద్రతా సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేయించారు.
ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారా అని గుర్తించేందుకు కోల్‌కతా పోలీులు, కేంద్ర బలగాలు, బాంబు నిర్వీర్య, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన బృందానికి గవర్నర్ బోస్ సారథ్యం వహించారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు ఎస్‌ఐఆర్ ఎంతో అవసరమని శనివారం గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే గవర్నర్, రాజ్‌భవన్‌ను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ లక్ష్యంగా చేసుకున్నారు.
'రాజ్‌భవన్ లోపల భాజపా నేరస్థులకు గవర్నర్ ఆశ్రయం కల్పించారు. వారికి బాంబులు, తుపాకులు సమకూర్చారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో గవర్నర్.. ఉత్తర బెంగాల్‌లో తన పర్యటనను కుదించుకుని రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే తనిఖీలకు నేతృత్వం వహించారు.