Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరిక

రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరిక
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:14 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్రం వెల్లడించింది. అయితే, రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

రాబోయే మూడు నెలలూ పండుగల సమయం, అలాగే, ఫ్లూ కేసులు పెరిగే కాలం గనుక ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ కోరారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు.

ఇప్పటివరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను మరింత మెరుగుపరుచుకుందామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే, 62శాతం మందికి కనీసం ఒక్కడోసు అందినట్టు చెప్పారు.
 
32 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10% కన్నా ఎక్కువ
దేశంలో 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగా ఉండగా.. 32 జిల్లాల్లో మాత్రం 5 నుంచి 10శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 67.79శాతం కేసులు కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం అక్కడ 1.99లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయని వివరించారు.

మిజోరం, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10వేలు కన్నా ఎక్కువగా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మిజోరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌ వేగంగా జరిగి, తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు.
 
అనవసర ప్రయాణాలు మానుకోండి
పండుగల సీజన్‌ వస్తుండటంతో వ్యాక్సిన్‌ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ అన్నారు.

కేరళలో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. పండుగల సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలకమండలి సభ్యులకేనా టిక్కెట్లన్నీ, మిగతావారికి?