ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. కోచింగ్ కోసం రోడ్డుపై నడిచి వెళుతున్న బీటెక్ విద్యార్థినిని కొందరు దుండగులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఆగ్రాకు చెందిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో కోచింగ్‌కు వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై అటకాయించారు. అనంతరం ఆమెను బలవంతంగా యమునా నది తీరంలో ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆ యువతిని తీవ్రంగా గాయపరిచి అక్కడ నుంచి పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి జారుకుంది. రాత్రి అవుతున్నా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ పరిస్థితుల్లో స్పృహలోకి వచ్చిన యువతి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదుచేశారు. అనంతరం యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.