కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప రాష్ట్ర పర్యటన ప్రస్తుతం బీజేపీలో చర్చకు దారితీసింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోని ప్రభుత్వం టేకాఫ్ అయిందని, ఇలాంటి స్థితిలో రాష్ట్ర పర్యటన వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర బీజేపీ నేతలు జంకుతున్నారు. ఎలాగైనా యడ్డీ పర్యటనకు బ్రేక్ పడేలా చూడాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీ నేతలు అధిష్ఠానానికి సూచిస్తున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట గాడిన పడేసేలా బొమ్మై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని భావిస్తున్న బీజేపీ నేతలు యడియూరప్ప గవర్నర్ పదవి చేపట్టేలా అధిష్ఠానం పెద్దలు ఒప్పించడం మంచిదని సూచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంతవరకు బొమ్మై ప్రభుత్వానికి తలనొప్పి సృష్టించే వ్యాఖ్యలు ఏవీ యడియూరప్ప చేయనప్పటికీ రాష్ట్రపర్యటనలో భాగంగా ఆయన తన ప్రసంగాలలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని బీజేపీ నేతలు భయపడుతున్నారు.