ప్రపంచ పర్యాటకులను ఆంధ్రప్రదేశ్ కు ఆకర్షించే క్రమంలో రుషికొండ బీచ్ రిసార్ట్ కు అంతర్జాతీయ హంగులు సమకూర్చనున్నామని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. ఈ క్రమంలో భీమిలి నుండి భోగాపురం వరకు బీచ్ రోడ్డు విస్తరణను మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ చేపడుతుందన్నారు.
యువజన సర్వీసులు, పురావస్తు, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ సిఇఓ, పర్యాటక అభివృద్ది సంస్ధ ఎండి సత్యన్నారాయణతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజత్ భార్గవ వివరాలను అందిస్తూ దేశంలో 974 కిలోమీటర్ల రెండవ పొడవైన తీరప్రాంతం , శాశ్వత నదులు, సుందరమైన బ్యాక్‌వాటర్‌లతో ఆంధ్రప్రదేశ్ అలలారుతుందన్నారు. ప్రభుత్వం ఈ సహజ భౌగోళిక లక్షణాలన్నింటినీ ఉపయోగించుకుని నది టూరిజం, ఎకో-టూరిజం, అడ్వెంచర్ టూరిజం విభాగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు.
పర్యాటక శాఖ కొత్తగా ప్రతిపాదించబడిన బీచ్ కారిడార్‌లో ప్రపంచ స్థాయి పర్యాటక రిసార్టులు, సాహస క్రీడా కార్యకలాపాలను అభివృద్ధి చేయనున్నామని, భీమిలి, భోగాపురం బీచ్‌లోని సీప్లేన్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తామని, అటవీ భూమిని ఆనుకుని ఉన్న బీచ్‌లో ఎకో-టూరిజం ప్రాజెక్ట్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, వసతి నిలయం, గోల్ఫ్ కోర్స్ లు టూరిజం ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తామన్నారు.
రూ. 10.50 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం తెన్నేటి పార్క్ సమీపంలో చిక్కుకుపోయిన బంగ్లాదేశ్ షిప్ ఎంవి మా కార్గోను బాంకెట్ హాల్స్, విభిన్నవంటకాల రెస్టారెంట్, వినోద అంశాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మార్చనున్నామన్నారు. రూ.163 కోట్ల వ్యయంతో పిపిపి పద్ధతిలో తోట్లకొండ బీచ్ వద్ద టన్నెల్ అక్వేరియం అభివృద్ధి చేస్తామన్నారు. కైలాసగిరి నుండి భోగాపురం వరకు బీచ్ కారిడార్ వెంబడి అభివృద్ధి చేయనున్నామన్న రజత్ భార్గవ సాగర్ నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, చేపల ఉప్పాడ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నగరంపాలెం, అన్నవరం, కంచర్లపాలెం బీచ్‌లలో వాష్‌రూమ్‌లు, తాగునీరు, ఫుడ్ కోర్టులు, ప్రథమ చికిత్స, సిసిటివి కంట్రోల్ రూమ్, సిట్టింగ్ బెంచీలు, రెక్లినర్‌లతో సిట్-అవుట్ గొడుగులు. పిల్లల పార్క్, ఫిట్‌నెస్ సామగ్రి, జాగింగ్ ట్రాక్, పార్కింగ్, సురక్షితమైన స్విమ్మింగ్ జోన్, బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, బీచ్ ఇన్ఫర్మేషన్ బోర్డ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి వసతులు కల్పిస్తామన్నారు.
అటవీ ప్రాంతాల్లో ఎకో-టూరిజం అభివృద్ధిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి. విశాఖపట్నం జిల్లా లంబసింగి, శ్రీకాకుళం జిల్లా జగతిపల్లిలో హై-ఎండ్ టూరిజం రిసార్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలో బెర్మ్ పార్క్, భవానీ ద్వీపం మధ్య కృష్ణా నదిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిర్వహించడానికి ప్రతిపాదించామన్నారు. ప్రసాద్ పధకంలో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో అమరావతి, శ్రీశైలం దేవాలయాలలో అభివృద్ది జరుగుతుండగా, సింహాచలం దేవాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా కేంద్రం సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిందన్నారు. అన్నవరం దేవాలయ అభివృద్ధి విషయం కూడా నిధులు కోరామని, ద్వారకా తిరుమల విజయవాడలోని దుర్గా ఆలయం, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం, పుట్టపర్తి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు.