Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు...

Advertiesment
lord rama

వరుణ్

, సోమవారం, 22 జనవరి 2024 (12:59 IST)
అయోధ్య నగరంలో నిర్మించిన రామాలయంలోని భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరాడు. ఈ మహా ఘట్టాన్ని కనులారా వీక్షించిన యావత్ భక్తజనకోటి భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. కొన్ని వందల యేళ్ల నాటి కలను సాకారం చేస్తూ సోమవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 
 
రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు. 
 
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పాల్గొన్నారు.
 
మరోవైపు, రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
 
ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య రామమందిరం: ప్రాణ్ ప్రతిష్ట.. రామ్ లల్లా కళ్లు తెరిచారు..