#AtalBihariVajpayee మృత్యువుకు భయపడని అజాతశత్రువు.. అటల్ జీ ఇకలేరు.
భారత దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్ బిహారీ వాజ్‌పేయి.. 1924, డిసెంబరు 25న మధ్యప్రదేశ్, గ్వాలియర్‌లో జన్మించారు. 93 ఏళ్ల బ్రహ్మచారి అయిన వాజ్‌పేయి.. సుదీర్ఘకాలం లోక్
భారత దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్ బిహారీ వాజ్‌పేయి.. 1924, డిసెంబరు 25న మధ్యప్రదేశ్, గ్వాలియర్‌లో జన్మించారు. 93 ఏళ్ల బ్రహ్మచారి అయిన వాజ్‌పేయి.. సుదీర్ఘకాలం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా, 1980 నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.
1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఆయన 13 రోజుల పాటు మాత్రమే ఆ పదవిలో వున్నారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవి పొంది 13 నెలలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మలచిన దేశభక్తుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. పార్టీలు, ప్రాంతాలకు అతీతుడైన అజాతశత్రువు. ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య ఉన్న తేడాను తెలిపిన అరుదైన ప్రజాస్వామ్యవాది. తన ప్రసంగాలతో, ప్రవర్తనతో ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన మహోన్నతుడు. ఎందరికో అభిమానపాత్రుడు. అలాంటి మహోన్నత వ్యక్తి ఇక లేరనే వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితగాథ హిందీలో హార్ నహీ మానూంగా అనే పేరుతో దాదాపు 450 పేజీల పుస్తకం వెలువడింది. ఆ పుస్తక రచయిత ప్రసిద్ధ జర్నలిస్టు విజయ్ త్రివేది. దాన్ని తెలుగులోకి అనువాదం చేసింది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తాను మృత్యువుకు ఏమాత్రం భయపడనని.. చెడు పేరుకు, లోకోపవాదానికి మాత్రమే భయపడతానని వాజ్‌పేయి అనేవారు.
తాను నమ్మిన రాముని కథ, రామమందిర వివాదాలు, సమస్యల పరిష్కారానికి వాజ్‌పేయి ప్రయత్నాలు అంతా ఇంతా కావు. 13 పార్టీలతో పడిన పాట్లు, పదవుల పందేరం బయటపడిన ప్రముఖుల నిజస్వరూపాలు, అమెరికా గూఢచార సంస్థల ముక్కూ, కళ్ళూ మూసి సాగిన పరమాణు రహస్యాలు, వైజ్ఞానిక విజయాలు, సస్పెన్సు థ్రిల్లర్ల వంటి పోఖ్రాన్ వీరగాథ, కలామ్-అటల్‌ల ధైర్య సాహసాలు ఇవన్నీ దేశ ప్రజలకు సుపరిచితాలు.
ఆర్థిక ఆంక్షలను అధిగమించిన వైనం, గొప్ప హృదయంతో పాకిస్థాన్‌కు అందించిన స్నేహహస్తం, లాహోర్ యాత్ర విశేషాలు, నవాబ్-ముషారఫ్‌ల కయ్యాలు, కజ్జాలు, కార్గిల్ వెన్నుపోటు విశేషాలు, పార్లమెంటుపై దాడులు, అంతకుముందు జరిగిన హైజాకులు.. పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా ప్రధానిగా వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయాలు అదరహో అనిపించాయి.
అటల్ జీకి అవార్డులు
వాజ్‌పేయికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. 1992లో పద్మ విభూషణ్, 1993లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, 1994లో లోకమాన్య తిలక్ పురస్కారం, 1994లో గోవింద్ వల్లభ్ పంత్ అవార్డులు వరించాయి. మోడీ ప్రధాని అయ్యాక తన ప్రియ గురువు వాజ్‌పేయిని భారతరత్న సత్కరించి సన్మానించారు.
అటల్ మరణవార్త విని బీజేపీతో దేశ ప్రజలు మూగబోయారు. రాష్ట్రపతి, ప్రధాని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో పాటు ప్రముఖులు వాజ్‌పేయి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.