ముఖ్యమంత్రి పీఠం పన్నీరుదే.. విశ్వాసానికి మారుపేరంటూ ఉబ్బేస్తున్న మంత్రులు
శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ పదవులనుంచి తప్పించే ఘట్టం ముగిశాక అన్నాడీఎంకేలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విలీనంపై నిన్నటిదాకా బెట్టు చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మన్నార్ గుడి ముఠా బహిష్కరణ తర్వాత ఒక్కసారిగా స్వరం మార్చారు.
శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ పదవులనుంచి తప్పించే ఘట్టం ముగిశాక అన్నాడీఎంకేలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విలీనంపై నిన్నటిదాకా బెట్టు చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మన్నార్ గుడి ముఠా బహిష్కరణ తర్వాత ఒక్కసారిగా స్వరం మార్చారు. వీలైనంత త్వరగా ఇరు వర్గాలు కలిసిపోయేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. శశికళకు పార్టీతో సంబంధం లేకుండా పోయాక బుధవారం ఉదయం నుంచే సీఎం ఎడప్పాడి ఆంతరంగిక మిత్రులైన కొందరు మంత్రులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అయితే అన్నిటికంటే పెద్ద ట్విస్టు ఏమిటంటే ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే జయ అనుచరుడిగా, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న పన్నీర్ సెల్వంనే సీఎం పీఠంపై కూర్చోబెట్టడం మంచిదని, అన్నాడీఎంకే సీనియర్ నేతలు కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రిగా పళనిస్వామిఉండాలని పార్టీ పెద్దలు సూచించడంతో ఇరువర్గాలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అలాగే మంత్రుల్లో మెజారిటీ సభ్యులు కూడా ఇదేవిధంగా అభిప్రాయపడుతున్నట్లు వినికిడి. మరోవైపు, అన్నాడీఎంకేలోకి ఓపీఎస్ రావడం ఖాయం కావడంతో మంత్రుల స్వరం పూర్తిగా మారిపోయింది. ఓపీఎస్ విశ్వాసానికి ప్రతీక అంటూ తెగ పొగిడేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దివంగత మాజీ సీఎం జయలలిత సమాధి సాక్షిగా శశికళపై ఓపీఎస్ తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సమాధిసాక్షిగా అన్నాడీఎంకేలో విలీనం కావాలని ఓపీఎస్ వర్గం భావిస్తోంది. కాగా పార్టీ కార్యాలయంలో బుధవారం తన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు దినకరన్‌కు అనుమతి ఇచ్చేందుకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయ్యన్ అనుమతి నిరాకరించారు. పార్టీ కార్యాలయంలో శశికళ, దినకరన్ చిత్రపటాలను కూడా తొలగించారు.
జయ మృతి తర్వాత పార్టీని కబళించిన శశికళ, ఆమె కుటుంబీకులను తరిమికొట్టేంతవరకూ తన పోరాటం ఆగదని గతంలో ప్రకటించానని, ఇప్పుడా లక్ష్యం నెరవేరిందని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. అన్నాడీఎంకే నుండి శశికళ కుటుంబం దూరం కావడం తాము చేస్తున్న ధర్మయుద్ధానికి లభించిన తొలి విజయమని ఆయన మీడియాతో చెప్పారు.