దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తిచేసింది. ఎన్నికల పనితీరుపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఎన్నికల తీరు భేషుగ్గా ఉందని తెలిపారు. నిజానికి ఎన్నికల సంఘం పనితీరు అధ్వాన్నంగా ఉందని దేశంలోని విపక్ష పార్టీలన్నీ మండపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఈసీ పనితీరును మెచ్చుకోవడం ఇపుడు చర్చనీయాంశమైంది.
ఆయన మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, 'మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ కారణం. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను చాలా గొప్పగా నిర్వహించారు. ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదు' అని దాదా అన్నారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో ఏళ్లుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయి... అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు.