ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఒక వివాహానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, తందూరీ, రోటీల విషయంలో జరిగిన చిన్న వివాదం ఇద్దరు యువకుల దారుణ మరణానికి దారితీసింది. వివాహ కార్యక్రమంలో భాగంగా ఒక ఫుడ్ స్టాల్ వద్ద జరిగిన మాటల ఘర్షణలో 17 ఏళ్ల ఆశిష్, 18 ఏళ్ల రవిని కొట్టి చంపేశారు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆశిష్, రవి తందూరి రోటీ కౌంటర్ వద్ద ఆహారం కోసం క్యూలో నిలబడ్డారని పోలీసులు తెలిపారు. వారికి వరుడి బంధువు రోహిత్, అతని కొంతమంది స్నేహితులు, ఇతర అతిథుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రోహిత్ బృందం జరిగిన వివాదాన్ని అవమానంగా భావించారు.
అంతే పెళ్లి నుండి స్నేహితుల బృందంతో బయటకు వెళ్ళిన తర్వాత, రోహిత్, అతని సహచరులు ఇనుప రాడ్లు, హాకీ స్టిక్స్, లాఠీలతో ఆశిష్, రవిలను వెంబడించారని తెలుస్తోంది. ఆపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో ఆశిష్, రవి ప్రాణాలు కోల్పోయారు.
ఆశిష్, రవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనుమానితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఇతరులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అమేథి అదనపు ఎస్పీ హరేంద్ర కుమార్ ధృవీకరించారు.