Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాన్సర్​కు త్వరలో అద్భుతమైన​ చికిత్స​!

క్యాన్సర్​కు త్వరలో అద్భుతమైన​ చికిత్స​!
, శుక్రవారం, 17 జనవరి 2020 (07:39 IST)
క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక విధానానికి ఐఐటీ హైదరాబాద్ బాటలు వేసింది. కేవలం క్యాన్సర్ బారిన పడిన కణాల మీద మాత్రమే ప్రభావం చూపే చికిత్సను ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో కనుగొన్నారు.

ఇప్పటికే ఎలుకల మీద చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం వల్ల త్వరలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించినా ఆ చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రోగిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. చికిత్స దుష్పరిణామాలను తట్టుకోలేక చనిపోయిన వారూ ఉన్నారు.

ఈ సమస్యకు పరిష్కారాన్ని ఐఐటీ హైదరాబాద్, బొంబాయి పరిశోధకులు చూపించారు. భిన్న చికిత్సా విధానాలు ఉపయోగించి... ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి ప్రభావం లేకుండా క్యాన్సర్ కణాలనే పూర్తిగా నాశనం చేయడంలో సఫలీకృతులయ్యారు. కదంబ మొక్క నుంచి సేకరించిన పదార్థం, ఐఆర్ 780డై వీరి పరిశోధనల్లో కీలక పాత్ర పోషించాయి.

ఎలుకపై ప్రయోగం నియర్ ఇన్ ఫ్రారెడ్ కిరణాలు 'ఐఆర్ 780డై'పై పడినప్పుడు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి క్యాన్సర్ కణాలు నాశనమైపోతాయి. కదంబం నుంచి సేకరించిన పదార్థం తిరిగి ఈ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. పరిశోధనల్లో భాగంగా రొమ్ము క్యాన్సర్ కణాలను ఎలుకల్లోకి పంపి పరిశీలించారు.

వీరు అభివృద్ధి చేసిన విధానంలో కేవలం క్యాన్సర్ కణాలపై మాత్రమే ప్రభావం చూపించినట్లు గుర్తించారు. అందుబాటులోకి వస్తే... ఐఐటీ హైదరాబాద్​లోని బయో మెడికల్ విభాగం ఆచార్యులు అరవింద్ కుమార్ రెంగన్, పరిశోధక విద్యార్థులు తేజశ్విని, దీపక్ భరద్వాజ్ ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు.

వీరి పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక జర్నల్ నానో స్కేల్​లో ఇటీవల ప్రచురితం అయ్యాయి. తాము అభివృద్ధి చేసిన చికిత్సా విధానం అందుబాటులోకి వస్తే.. వివిధ రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా నివారించ వచ్చని.. బాధితులకు ఊరట కల్పించవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.

అతి త్వరలో ఈ చికిత్సా విధానం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్