సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో కులం పేరుతో ఒక వ్యక్తిని దూషించడం నేరం. అయితే, నాలుగు గోడల మధ్య ఈ పని చేస్తే మాత్రం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పను వెలువరించింది. ఈ మేరకు ఓ కళాశాల యజమానిపై నమోదు చేసిన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదని పేర్కొంటూ కొట్టివేసింది.
బాధితుడి ఫిర్యాదు ప్రకారం ఈ ఘటన ఆఫీసులోని ఛాంబరులో జరిగిందని, అక్కడ ఇతరులు ఎవరూ లేరని గుర్తుచేసింది. బహిరంగ ప్రదేశాల్లో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అవమానాలకు గురికాకుండా కాపాడడమే అట్రాసిటీ యాక్ట్ ఉద్దేశమని, అందువల్ల ఈ కేసులో అట్రాసిటీ యాక్ట్‌లోని సెక్షన్ 3(1)(ఎస్) వర్తించదని స్పష్టం చేసింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ స్కూలులో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదు. దీంతో పిల్లలకు సరిగా చదువు చెప్పడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ముందు ఆందోళనకు దిగారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సదరు స్కూలు యజమాని తమకు రూ.5 లక్షలు ఇవ్వజూపాడని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు.
ఈ విషయంపై మాట్లాడేందుకు పిలిచి తన క్యాబిన్‌లో కులం పేరుతో దూషించాడని ఒక విద్యార్థి తండ్రి ఆరోపించాడు. స్కూలు యజమాని తీరుతో ఆవేదన చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి యజమానిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ విచారించింది. ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదని తాజాగా తీర్పు వెలువరించింది.