Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాట కీలక పరిణామం : బీజేపీతో అన్నాడీఎంకే కటీఫ్

admk bjp
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:57 IST)
తమిళనాట కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీతో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ తెగదెంపులు చేసుకుంది. వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ  ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సారథ్యంలో జరిగిన పార్టీ కార్యదర్శలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కార్యదర్శుల సమావేశంలో బీజేపీతో పొత్తు తెంచుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 
 
ఇదే విషయంపై ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు తెలిపారు. అదేసమయంలో భారతీయ జనతా పార్టీతో ఉన్న బంధాన్ని కూడా తెంచుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 
 
కాగా, తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యతిరేక ఉంది. గత ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం వల్లే నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ఇటీవలికాలంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై దూకుడు ఎక్కువైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి దివగంత జయలలిత, అన్నాడీఎంకే నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో అన్నామలైను మార్చాలంటూ వారు చేసిన ప్రయత్నాలు ఢిల్లీ కమలనాథుల వద్ద ఫలించలేదు. దీంతో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 
 
అయితే, ఇక్కడ మరో ప్రచారం సాగుతోంది. తమిళనాడు ప్రజల్లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యతిరేత ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే అన్నాడీఎంకే కనుమరుగు కావడం ఖాయమనే భావన ప్రజల్లోనే ఏర్పడింది. దీంతో పార్టీతో పాటు తమ రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు అన్నాడీఎంకే నేతలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ బీజేపీకే మద్దతు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ : నారా లోకేశ్