Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మను తోసేశారు.. శశికళ సీఎంగా వద్దే వద్దన్న పాండ్యన్-పన్నీర్‌కే మళ్లీ పట్టం అంటోన్నకేంద్రం

తమిళనాడులో ఏం జరుగుతోంది.? కేంద్రం ఎవరిపై మొగ్గుచూపుతుంది? ఒకటి రెండు రోజులు గవర్నర్ విద్యాసాగర్ తమిళనాడుకు వచ్చే అవకాశం ఉందని.. దీంతో సబ్దత సద్దుమణిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శశికళ వర్గ

అమ్మను తోసేశారు.. శశికళ సీఎంగా వద్దే వద్దన్న పాండ్యన్-పన్నీర్‌కే మళ్లీ పట్టం అంటోన్నకేంద్రం
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:18 IST)
తమిళనాడులో ఏం జరుగుతోంది.? కేంద్రం ఎవరిపై మొగ్గుచూపుతుంది? ఒకటి రెండు రోజులు గవర్నర్ విద్యాసాగర్ తమిళనాడుకు వచ్చే అవకాశం ఉందని.. దీంతో సబ్దత సద్దుమణిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శశికళ వర్గంపై మోడీ సర్కారు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. మన్నార్ గుడి వర్గం పట్ల కేంద్రం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో తంబిదురైని చేతిలో పెట్టుకుని.. మళ్లీ పన్నీర్ సెల్వంనే ముఖ్యమంత్రిని చేయాలని కేంద్రం భావిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌ చెన్నై రానందున శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న విద్యాసాగర్‌రావు సోమవారం రాత్రి చెన్నైకి రాకుండా ముంబైకి చేరుకున్నారు. 
 
శశికళ, దివంగత జయలలితలపై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో త్వరలోనే తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపథ్యంలో గవర్నర్‌... శశికళతో ప్రమాణస్వీకారం చేయించే విషయంలో గవర్నర్‌ న్యాయసలహా కోరినట్లు సమాచారం.
 
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాలని కోరుతూ చెన్నైకి చెందిన సెంథిల్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
 
జయలలిత ఆస్తుల కేసులో శశికళ దోషి అని తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వస్తుందని.. అదే జరిగితే రాష్ట్రంలో మళ్లీ శాంతిభద్రతలు అదుపు తప్పే పరిస్థితి వస్తుందని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో జయలలిత మృతిపై అన్నాడీఎంకే నేత పాండ్యన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయెస్‌గార్డెన్‌లో జయలలితతో ఘర్షణ పడ్డారని, ఆమెను ఎవరో తోసేయడంతో కిందపడిపోయారని అన్నారు. ఆర్డినెన్స్‌కు సంబంధించి వాదన జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 22వ తేదీన ఘర్షణ జరిగిందని అమ్మను కింద తోసేయడంతోనే ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి కూడా వివరాలు బయటికి పొక్కలేదన్నారు. 
 
అందుచేత జయలలిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పాండ్యన్‌ డిమాండ్ చేశారు. శశికళకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అర్హత లేదని ఆయన అన్నారు. కాగా పాండ్యన్‌ చేసిన ఆరోపణలను శశికళ వర్గీయులు కొట్టిపారేశారు. అమ్మను హత్య చేసిన చందంగా పాండ్యన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని శశి వర్గం అంటోంది. 
 
ఇదిలా ఉంటే.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలపై ఆమెకు చికిత్స అందించిన లండన్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు రిచర్డ్ బాలే స్పందించారు. జయ మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని, శ్వాస సంబంధమైన ఇబ్బందులు, అవయవాలు దెబ్బతినడం వల్లే ఆమె మృతి చెందారని వివరించారు. ఆమెను బతికించేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జయలలితకు అందించిన చికిత్స పట్ల వైద్యుల సమాధానాలకు ఏమాత్రం పొంతన లేదని వార్తలొస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుస్తులు తీయించి.. గ్రౌండ్‌లో నిలబెట్టిన వీడియో తీసిన కీచక హెడ్మాస్టర్