ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన మంత్రి మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఆ మంత్రి పేరు రాజేంద్ర పాల్ గౌతమ్. ఢిల్లీలో జరిగిన ఓ మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఓ వర్గం ప్రజల మనోభవాలు దెబ్బతినేలా ప్రసంగించి వివాదంలో చిక్కుకున్నారు.
ఇదే అదునుగా భావించిన బీజీపీ, వీహెచ్‌పీలు మంత్రిపై విమర్శలు దాడి మొదలుపెట్టాయి. మతమార్పిడి కార్యక్రమంలో ఏకంగా మంత్రి పాల్గొనడం సిగ్గుచేటంటూ విరుచుకుపడ్డాయి. ఆయన్ను తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, తాను సంకెళ్ల నుంచి విముక్తి పొందినట్టు చెప్పారు. ఈ రోజు మళ్లీ పుట్టానని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హక్కు కోసం, సమాజంపై జరిగే దౌర్జన్యాల వియంలో మరింత గట్టిగా పోరాటం చేస్తానని చెప్పారు. పనిలోపనిగా తన రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.