Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు.. ఆప్ నేతల భావోద్వేగం!!

Manish Sisodia

ఠాగూర్

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (16:38 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌కు చెందిన నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా, ఆప్ మంత్రి అతిశీ కన్నీటిపర్యంతమయ్యారు. ఎట్టకేలకు సిసోడియా బయటకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఢిల్లీలోని చిన్నారుల విజయమని వ్యాఖ్యానించారు. 
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా చిన్నారుల భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఎవరికీ రాని ఆలోచన మనీశ్ సిసోడియాకు వచ్చిందని, దానిని చేతల్లో పెట్టి ఢిల్లీలోని నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం తపనపడ్డారని గుర్తుచేసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని అన్యాయంగా జైలుకు పంపారంటూ విమర్శలు గుప్పించారు.
 
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ.. సిసోడియా 530 రోజుల పాటు జైలులోనే గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందన్న వార్త విని యావత్ దేశం సంతోషం వ్యక్తం చేస్తోందన్నారు. ఢిల్లీలోని చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే సిసోడియా చేసిన నేరమని అన్నారు. విద్యాశాఖలో ఆయన గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్య అందించాలని తాపత్రయపడ్డారని చెప్పారు.
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గత 17 నెలలుగా జైలులో ఉంటున్న మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బలాంటిదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి గత 17 నెలలుగా ఊచల వెనకే ఉండిపోయారని చెప్పారు. చివరికి ఈ రోజు నిజం గెలిచిందన్నారు. సిసోడియాకు న్యాయం జరిగిందని అన్నారు. ఇదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌లకు కూడా త్వరలో బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండపానికి తొలి భార్య.... పెళ్లి పీటలపై నుంచి వరుడు పరార్!!