వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకుందామనుకుని బండరాళ్లపై నీరు ప్రవహిస్తుండగా అక్కడికి వెళ్లింది ఓ యువతి. ఐతే ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి జారి కిందపడిపోయింది. తుమకూరు సమీపంలోని మైదాల ట్యాంక్ తూము వద్ద 15 అడుగుల లోయలో జారి పడి రాత్రిపూట అక్కడే ఇరుక్కుపోయింది 20 ఏళ్ల హంస గౌడ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని. సిద్దగంగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ 3వ సెమిస్టర్ చదువుతున్న హంస ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలు కీర్తనతో కలిసి మందరగిరి హిల్స్‌ను సందర్శించారు. ట్యాంక్ తూము వద్ద ఉన్న జలపాతం వారిని ఆకర్షించింది. సెల్ఫీ తీసుకుంటుండగా హంస జారిపడి కొట్టుకుపోయింది. దీనితో కీర్తన వెంటనే హంసా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.
అగ్నిమాపక సిబ్బందితో పాటు డీవైఎస్పీ చంద్రశేఖర్, క్యాత్‌సండ్ర పీఎస్‌ఐ చేతన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే రాత్రి 7 గంటల వరకు హంస జాడ తెలియలేదు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆపరేషన్ మళ్లీ ప్రారంభమైంది. వారు ఇసుక బస్తాలను ఉంచడం ద్వారా నీటి ప్రవాహాన్ని రాకుండా కాస్తంత అడ్డుకున్నారు. అనంతరం వారికి హంస అరుపులు వినబడ్డాయి. పోలీసులు కేకలు వస్తున్నవైపు చూడగా బండరాళ్ల పగుళ్ల మధ్య ఇరుక్కుపోయి కనిపించింది. దాదాపు 20 గంటలపాటు అక్కడే ఆమె చిక్కుకుపోయింది. మధ్యాహ్నానికి ఆమెను బయటకు తీశారు.
ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. హంసా మాట్లాడుతూ, నేను దేవుడిని, నా తల్లిదండ్రులను ప్రార్థించడం ద్వారా ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. అలాంటి రెస్క్యూ ఆపరేషన్‌లు విజయవంతం కావడాన్ని టీవీలో చూసినప్పుడు నాకు నమ్మకం కలిగింది. రక్షించిన వారికి నేను కృతజ్ఞురాలిని. సెల్ఫీల మోజులో ఉండొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పింది.