రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోడీ ఆధ్యాత్మిక బాటపట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆయన శనివారం కేదర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
ఆదివారం ఉదయం బద్రీనాథ్‌లోని నారాయణుడిని మోడీ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ పూజారులు, అధికారులు మోడీకి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మోడీ శనివారం హిమాలయక్షేత్రం కేదార్‌నాథ్‌లోని కేదారీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేదార్ గుహలో 12 గంటల పాటు మోడీ ధ్యానం చేశారు.
తన ధ్యానం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ, బాబా కేదారినాథ్ తనకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారని, అందుకే ఆయనను మరేమీ ఇవ్వాలని కోరలేదన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని వ్యాఖ్యానించారు. కష్టించి పనిచేసే సభ్యుల బృందం దొరకడం ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలందరికీ యావత్ భారత దేశం సందర్శించే శక్తి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.