మహారాష్ట్రలో యవత్మల్ జిల్లా కలెక్టర్ ఎండి. సింగ్ వైఖరికి నిరసనగా 89 మంది వైద్యులు ఒక్కసారిగా రాజీనామాలు చేశారు. తమతో అమర్యాదగా ప్రవర్తించిన కలెక్టర్‌ను బదిలీ చేసేంతవరకు తాము విధులకు హాజరుకామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మెడికల్ అసోసియేషన్ ధ్రువీకరించింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యులు, వారి బంధువుల కోసం ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 50 బెడ్‌లను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేసేందుకు తమ ప్రతినిధి కలెక్టర్ వద్దకు వెళ్లారని మహారాష్ట్ర స్టేట్ గెజిటెడ్ మెడికల్ ఆఫీసర్స్ గ్రూప్ ఆర్‌గనైజేషన్ (ఎంఎజిఎంఒ) యవత్మల్ యూనిట్ కార్యదర్శి డా.సంఘర్ష్ రాథోడ్ తెలిపారు.
అలాగే వారంలో ఒక రోజు సెలవు ఇప్పించాలని, ప్రతిరోజూ నివేదికలు సమర్పించేందుకు కాల పరిమితిని కల్పించాలని కోరారు. అయితే సింగ్ వారి సమస్యలు పట్టించుకోకుండా నివేదిక సమర్పించలేదంటూ వైద్యులను దూషించడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారని అన్నారు.
దీంతో వైద్యులు ఆయన తీరుకు నిరసనగా యవత్మల్ జిల్లా పరిషద్ సిఇఒకు తమ రాజీనామాలను సమర్పించారని అన్నారు. ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు.