నేపాల్ - టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకు మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. అనేక వేల మంది నిరాశ్రయులయ్యారు. మంగళవారం ఉదయం సంభవించిన ఈ భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైన విషయం తెల్సిందే. ఈ భూప్రకంపనల ధాటికి అనేక భవనాలు నేలమట్టం కాగా, భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఈ మేరకు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ భూప్రకంపనలు నేపాల్, టిబెట్ సరిహద్దులతో పాటు ఢిల్లీ, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో కనిపించాయి.
మంగళవారం ఉదయం వెనువెంటనే మూడుసార్లు భూమి కంపించిందని, మొదటి భూకంప తీవ్రత 7.1 పాయింట్లు కాగా, ఉదయం 7.02 గంటలకు 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం, మరో ఐదు నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. భౌగోళిక పరిస్థితులు, భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగానే హిమాలయాల పక్కనే ఉన్న నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. కాగా, 2015లో సంభవించిన పెను భూకంపంలో దాదాపు 9 వేల మంది చనిపోగా 25 వేల మందికిపైగా గాయపడ్డారు. దాదాపు 5 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.