Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇకపై నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ చేస్తే ఐదేళ్ల నిషేధం!

వరుణ్

, బుధవారం, 19 జూన్ 2024 (15:51 IST)
ఈ మధ్యకాలంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు నకిలీ బాంబు కాల్స్‌ తరచూ వస్తున్నాయి. దాంతో యాజమాన్యాలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తోంది. నకిలీ కాల్స్‌ కేసుల్లో దోషులుగా తేలితే.. ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు బీసీఏఎస్‌ వెల్లడించింది. 
 
ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వశాఖ ముందు ఉంచనున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ప్రస్తుతం మూడు నుంచి ఆరు నెలల నిషేధం మాత్రమే ఉంది. నిందితులు ఏ ఎయిర్‌లైన్‌కు అయితే బెదిరింపులు చేశారో.. దానివరకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తోంది. అయితే అన్ని సంస్థల విమానాలకు దీనిని వర్తింపజేయాలని బీసీఏఎస్‌ చూస్తోంది. 
 
ఇదిలావుంటే మంగళవారం దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు ఒకే రోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపుల కారణంగా కొన్ని గంటలపాటు విమానాశ్రయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మధ్యాహ్న సమయంలో ఒకే మెయిల్‌ ఐడీ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని విమానాశ్రయాలకు మెయిళ్లు వచ్చాయి. 'కేఎన్‌ఆర్‌' అనే ఆన్‌లైన్‌ గ్రూపు ఈ బెదిరింపు మెయిళ్ల వెనక ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానానికి కూడా ఈ తరహా కాల్ వచ్చింది. అయితే అవన్నీ ఉత్తుత్తివే అని అధికారులు తేల్చారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి...