కోవిడ్-19 మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు వైద్యులకు కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,188కి చేరింది.
ఇటీవల ఈఎన్‌టీ సమస్యతో వైద్యం చేయించుకుని మృతి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో... ఆమె ద్వారా ఈ ఐదుగురు వైద్యులకు కరోనా సోకినట్టు భావిస్తున్నారు. కరోనా బారిన పడిన వైద్యుల్లో ఎస్ఎమ్‌హెచ్‌ఎస్ ఆస్పత్రి నుంచి ముగ్గురు, స్కిమ్స్-జేవీసీ ఆస్పత్రి, ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ మూడు ఆస్పత్రులు శ్రీనగర్‌లోనే ఉన్నాయి.
ఇక వైరస్ బారినపడి మృతి చెందిన హబ్బా కదల్ శ్రీనగర్‌కి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మహిళ మరణంతో కాశ్మీర్‌లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. వైరస్‌తో మృతి చెందిన హబ్బా కదల్ ముందుగా శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమెకు చికిత్స అందించే క్రమంలో ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో మరో మూడు నెలలపాటు కర్ఫ్యూ పొడిగించారు. కరోనా మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఒక్కసారిగా పెరగొచ్చని కలెక్టరలందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆదివారం నాడు 25 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 92కు చేరుకుంది. 32 మంది చికిత్స పొందుతుండగా.. 59 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.