Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన ఎల్‌జేపీ నేతలు!!

ljp leaders

ఠాగూర్

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (09:27 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 19వ తేదీన తొలిదశ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన లోక్‌జన శక్తి పార్టీ (రామ్‌ విలాస్‌)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఈ పార్టీకి 22 మంది సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. వీరిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బిహార్‌ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ కుమార్‌, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్‌, రవీంద్ర సింగ్‌ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరంతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాజు తివారీకి రాజీనామా లేఖలు సమర్పించారు. ఇకపై విపక్ష కూటమి 'ఇండియా' కూటమికి మద్దతు ప్రకటించారు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సీట్లను అమ్ముకుంటోందని రాజీనామా చేసిన నేతలు ఆరోపించారు. సమస్తీపుర్‌, ఖగడియా, వైశాలి లోక్‌సభ స్థానాల కోసం రూ.కోట్లు తీసుకున్నారన్నారు. చిరాగ్‌ పాసవాన్‌, ఆయన సన్నిహితులే స్వయంగా సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. అభ్యర్థులను ఖరారు చేసే ముందు పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన నాయకులపై పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.
 
'బయట నుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీకోసం పనిచేస్తున్న నేతలకు టికెట్లు ఇవ్వాలి. బయటి వారికి ఇస్తున్నారంటే పార్టీలో సమర్థులు లేరనే అర్థం. పార్టీ కోసం పనిచేసి మిమ్మల్ని నాయకులను చేయడానికి మేమైనా కార్మికులమా? బయటివారికి టికెట్లు కేటాయించి పార్టీ పట్ల మాకున్న నిబద్ధతను ప్రశ్నించారు. ‘నూతన బిహార్‌’ కల సాకారం కోసం చేస్తున్న కృషిని విస్మరించారు. ఇక దేశాన్ని రక్షించాలంటే 'ఇండియా' కూటమికి అండగా నిలవాల్సిందే. మేమంతా విపక్ష కూటమికి మద్దతునివ్వబోతున్నాం' అని కుశ్వాహా అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఎల్.జే.పికి బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఐదు సీట్లను కేటాయించింది. హాజీపూర్, వైశాలి, ఖగడియా, సమస్తీపూర్, జముయీ ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జోగి రమేష్ ఓ జోకర్... చంద్రబాబు జోలికొస్తే... గుడ్డలూడదీసి తంతాం : బుద్ధా వెంకన్న