రైలులో ప్రయాణం. 14 గంటల జర్నీ. ఇంజనీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల యువతికి అనుకోకుండా నెలసరి వచ్చింది. దీనికి తోడు ఆమె వద్ద శానిటరీ ప్యాడ్లు లేకపోవడంతో నానా తంటాలు పడింది. పక్కనున్న ఓ మహిళను ప్యాడ్ వుందా అని అడిగింది. కానీ ఆమె దగ్గర కూడా లేకపోవడంతో పాటు.. తెచ్చుకోవచ్చు కదా అనే సమాధానం వచ్చింది.
చివరికి టిష్యూ పేపర్ తీసుకోమని సలహా వచ్చింది. ఇలా తనకు ఏర్పడిన ఇబ్బంది మరెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో 27 ఏళ్ల యువతి.. చేంజ్ డాట్ ఆర్గ్ మాధ్యమంగా ఓ పిటిషన్ వుంచింది. ఈ పిటిషన్‌కు వేలాది మంది ఆమెకు మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు.
రైలులోనే ప్యాడ్ వెండింగ్ మెషీన్ ఉంటే బాగుండుననిపించిందంటూ పిటిషన్ పెట్టగా.. ఇప్పటికే ఎనిమిది వేల మంది సంతకాలు చేశారు. దీనిపై రైల్వే శాఖ సైతం స్పందించింది. ఇప్పటికే రైళ్లలో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది. ఇందులో భాగంగా 36 రైళ్లలో ఇవి ఉన్నాయని, మిగతా రైళ్లలోనూ త్వరితగతిన ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.