ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ గుర్గావ్‌లో అత్యాచారంతో పాటు హత్య చోటుచేసుకుంది. అది కూడా 13 ఏళ్ల బాలికపై. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో నరేలా ప్రాంతానికి చెందిన దళిత బాలిక (13)పొరుగునే ఉన్న గుర్గావ్‌లో అత్యాచారం, హత్యకు గురైంది.
ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమ కుమార్తె దహనసంస్కారాలు వెంటనే పూర్తి చేయాలంటూ యజమాని బంధువు తమపై ఒత్తిడి తెస్తున్నారు అంటూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది.
యజమానురాలి సోదరుడి భార్య ప్రసవించడంతో సాయం చేసేందుకు జూలై 17న గుర్గావ్‌కు 13 ఏళ్ల బాలికను పంపారు. అయితే తన కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం మా యజమాని తనకు ఫోన్ చేసి చెప్పారని.. రాత్రి ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని మా ఇంటికి తీసుకువచ్చారు. వెంటనే దహన సంస్కారాలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశారు" అని తండ్రి పోలీసులకు తెలిపారు. యజమానురాలి సోదరుడు ప్రవీణ్ వర్మ, ఇతరులు కలిసి తన కుమార్తెను చంపారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు స్పందించిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో గుర్గావ్‌లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ప్రవీణ్ ను అరెస్టు చేశారు.