కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెలాఖరులో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే టీకా అందుబాటులోకి వస్తుందన్న కథనాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. కరోనా అందుబాటులోకి వస్తే రోజుకు కేవలం వంద మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ రాగానే అందరికీ టీకాలు వేయడం జరగదన్నారు. తొలుత ప్రతి రోజూ ఒక్కో వ్యాక్సిన్ బూత్‌లో 100 మందికి మాత్రమే టీకా వేస్తారట. ఇలా రోజుకు 100 మంది చొప్పున అందరికీ వ్యాక్సిన్ వేస్తామని అశ్విని కుమార్ చెప్పారు.
బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో వ్యాక్సిన్ రాగానే అందరికీ ఇచ్చేస్తారని ఆశలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. అయితే వ్యాక్సిన్ అందరికీ అందుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి భయాలూ అక్కర్లేదని అశ్విని కుమార్ నొక్కిచెప్పారు.
మరోవైపు, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వేకీ పాల్ స్పందిస్తూ, ఇప్పటికే 6 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు వెల్లడించారు. తాజాగా మరో వ్యాక్సిన్‌కు కూడా క్లినికల్ ట్రయల్స్ కోసం క్లియరెన్స్ ఇవ్వబోతున్న విషయాన్ని చెప్పారు.
ఈ ట్రయల్స్ పూర్తయిన తర్వాత వీటిలో కొన్నింటికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతులు లభిస్తాయి. ఇదే జరిగితే ఇక వ్యాక్సిన్ పంపిణీయే తరువాయి. దీనికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు కూడా తాము చేస్తున్నామని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ వెల్లడించారు.
వ్యాక్సిన్ నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి 29వేల కోల్డ్ చైన్ పాయింట్స్, 240 వాక్-ఇన్ కూలర్స్, 70 వాక్-ఇన్ ఫ్రీజర్స్, 45000 ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్స్, 41,000 డీప్ ఫ్రీజర్స్, 300 సోలార్ రిఫ్రిజిరేటర్స్‌ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.