చెన్నై-బెంగళూరు, ముంబై-ఢిల్లీ వంటి పది పట్టణాలకు కొత్త మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ నిర్ణయించింది. చైనా, జపాన్ దేశాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో భారత్‌లో కూడా బుల్లెట్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది.
ఢిల్లీ నుంచి ముంబై, కొల్‌కతా, వారణాసి, భోపాల్, అమృతసర్, అహ్మదాబాద్ వంటి ఆరు మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇదేవిధంగా నాగ్‌పూర్-ముంబై, పాట్నా-కోల్‌కతా మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మైసూర్-బెంగళూరు-చెన్నైల మధ్య బుల్లెట్ రైళ్లను కూడా నడిపేందుకు రంగం సిద్ధమైంది.
మొత్తం మీద దేశ వ్యాప్తంగా 10 మార్గాల్లో బుల్లెట్ల రైళ్ల కోసం రైల్వే శాఖ పథకం వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాలని రైల్వేశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం వేయాల్సి వుంది. 2025 లేదా 2026లో ఈ బుల్లెట్ రైళ్లు పూర్తి స్థాయిలో నడపనున్నారు.