Publish Date: Tue, 22 Jul 2008 (14:40 IST)
Updated Date: Tue, 22 Jul 2008 (14:39 IST)
ఓ శుభ సందర్భాన అవతలి వ్యక్తిపై మీలో పీకలదాకా ప్రేమభావం కలిగింది. కానీ అవతలివారికి కూడా మీపై అంతే ప్రేమ ఉందా అంటే మీనుంచి సమాధానం రాకపోవచ్చు. ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం మీకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.
అసలు మిమ్మల్ని వారు ఇష్టపడుతున్నారా అన్న విషయం సైతం మీకు తెలియకపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు తొందరపడి మీ మనసులోని భావాన్ని వారి వద్ద వ్యక్తీకరిస్తే వారు మిమ్మల్ని ప్రేమించకపోగా మీ ప్రేమను చులకనగా భావించవచ్చు.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎదుటివారిలో మీపై ఎలాంటి భావం ఉంది. వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా. ఇష్టపడుతుంటే ఆ ఇష్టం ఎంత బలీయమైంది అనే విషయాల్ని తొలుత తెలుసుకోండి.
అందుకోసం మీ మాటల్నే ఆయుధాలుగా వాడండి. మీ మాటల్తో ఎదుటి వారిని మాయ చేయండి. ఎలా చేయాలంటారా. చాలా సింపుల్. తొలుత మీరు ప్రేమించినవారితో మాటలు కలపండి. ఆ మాటల సందర్భంలో మీలో ఉన్న ఫ్లస్ పాయింట్లు వారికి తెలిసేలా చేయండి. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా మీరు ఆ పని చేస్తున్నట్టుగా మాత్రం ఎదుటివారికి తెలియనీయకండి.
అలా మాటలు కలిసిన తర్వాత మీ మాటల్తో వారిని మాయలో పడేసే ప్రయత్నాన్ని ప్రారంభించండి. మీ మాటలు వారిని వేరే ఊహాలోకంలోకి తీసుకెళ్ల గలగాలి. మీ మాటలకోసం, మీతో సమయాన్ని గడపడం కోసం వారు ఎదురుచూడగలగాలి. అదే సమయంలో మీలో ఉన్న భావమేంటో ఎదుటివారికి అంతుబట్టకూడదు.
అలా మీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో మీ ధ్యాసలో గడిపేయడం వారికి సుఖంగానూ, ఆనందంగాను అనిపించాలి. అలాంటి సమయంలో మీలో ఉన్న ఆశల్ని, అభిప్రాయాల్ని ఎదుటివారివద్ద వెలిబుచ్చండి. మీ అభిప్రాయాలను, మీ ఇష్టాలను నెరవేర్చడానికి వారు ఎంతగా ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని జాగ్రత్తగా అంచనా వేయండి.
అలా కొద్ది కొద్దిగా ఎదుటివారిలో మీ గురించి ఉన్న అభిప్రాయంపై ఓ ఖచ్చితమైన నిర్ణయానికి రండి. మీ సానిహిత్యం నుంచి దూరమయ్యే క్షణంలో ఎదుటివారి కళ్లలో కలిగే ఆందోళన, మీ నుంచి దూరం అవుతుంటే వారిలో కలిగే అలజడిని వారిలో గుర్తించండి. అలా కొద్దిరోజులు గమనించగల్గితే ఎదుటివారిలో మీపై ఉన్న ప్రేమభావం తీవ్రత ఎంతో మీకు అర్ధమవుతుంది.
అప్పుడు ధైర్యంగా మీ ప్రేమ విషయాన్ని వారి వద్ద వ్యక్తీకరించండి. తాము చెప్పలేని విషయాన్ని మీరే స్వయంగా చెప్పినందుకు మీ ప్రేయసి లేదా ప్రియుడు ఎంతగా సంతోషిస్తారో మీరే స్వయంగా చూడవచ్చు.