Publish Date: Fri, 23 Nov 2007 (19:16 IST)
Updated Date: Fri, 23 Nov 2007 (19:15 IST)
ఇంటర్నెట్ ద్వారా మీ ప్రేయసీప్రేమికుల ప్రేమ చిగురించింది. ఇమెయిళ్ళ ద్వారా మీరు చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు మిమ్మల్నిద్దరిని మానసికంగా దగ్గర చేశాయి. కలిసిన అభిరుచులు, పంచుకున్న ఆలోచనలతో మీరిద్దరు చక్కని ప్రేమ జంటగా మిమ్మల్ని మీరు ఆపాదించుకున్నారు.
ఇక ఇద్దరు కలిసే సమయం ఆసన్నమయ్యింది. తొలిసారి కలుసుకుంటున్నామన్న ఆలోచన మిమ్మల్ని ఒక చోట నిలవనీయడంలేదు. కలయికను ఫలవంతం చేసుకోవాలన్న ఆలోచన ఎన్నెన్నో ప్రణాళికలకు ఊపిరి పోస్తున్నది. కలుసుకున్న తరువాత ఏం చేయాలి అనే దానికి చక్కని చిట్కాను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం.
ఇద్దరు ఒకచోట కలుసుకున్నారు. అప్పుటికే సాయంకాలం అయినట్లయితే... ఇద్దరు కలిసి హాస్యభరితమైన సినిమాకు వెళ్ళండి. ఏడుపుగొట్టు లేదా సీరియస్ సినిమాల వైపు అసలే వెళ్ళకండి. అనంతరం జనసమ్మర్థం అధికంగా లేని రెస్టారెంట్‌ను ఎంచుకుని నచ్చిన ఆహారాన్ని ఎంచక్కా కలిసి ఆరగించండి.
ఆ సమయంలో మీరు చూసిన సినిమాకు సంబంధించిన ముచ్చట్లతో మొదలుపెట్టి, ఇద్దరికి ఇష్టమైన అంశాలపై మనసు తీరా మాట్లాడుకోండి. ఆ విధంగా మీ తొలికలయికను మరుపురాని అనుభూతిగా మిగుల్చుకోండి.