Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే.. పాపం ఆర్ఆర్ఆర్‌కు మొండిచేయి!

nallari kiran kumar reddy

వరుణ్

, సోమవారం, 25 మార్చి 2024 (09:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ ఆదివారం రాత్రి ప్రకటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, బీజేపీ ఆరు ఎంపీ సీట్లు, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తనకు టిక్కెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకునివున్న వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కమలనాథులు మొండి చేయి చూపించారు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు, బీజేపీ ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. అలాగే, వైకాపాను వీడి బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు బీజేపీ తిరుపతి టిక్కెట్ ఇచ్చింది. ఈయన పార్టీలో చేరిన ఒక్క రోజే టిక్కెట్‌ను కేటాయించడం గమనార్హం.
 
ఈ జాబితాలో ప్రకారం అరకు ఎస్టీ నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి ఎస్సీ స్థానం నుంచి వరప్రసాద్, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న పురంధేశ్వరికి రాజమండ్రి సీటును ఇచ్చింది. ఈమె గత 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో జాతీయ స్థాయిలో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
 
అలాగే, సీఎం రమేశ్‌ రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారు. రెండుసార్లు టీడీపీ ఆయనను రాజ్యసభకు పంపింది. 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎంపీగా ఆయన రెండో దఫా పదవీ కాలం వచ్చే నెల మూడో తేదీతో ముగుస్తోంది. బీజేపీ అధికారికంగా ప్రకటించకముందే అనకాపల్లి టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ అభ్యర్థిగా అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇప్పుడు అరకు టికెట్‌ దక్కించుకున్నారు.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. వాటిలో కొన్ని స్థానాలకు అభ్యర్థులుగా కొందరి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాచౌదరి పేరుని విజయవాడ పశ్చిమ స్థానానికి పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్లకు నడికుదిటి ఈశ్వర్రావు, విశాఖ ఉత్తరం స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, అనపర్తికి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కైకలూరుకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ధర్మవరానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ లేదా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బద్వేలుకు రోహన్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీటితో పాటు పాడేరు, ఆదోనీల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆదోనికి పార్థా డెంటల్‌ ఆసుపత్రి యజమాని పార్థసారధి పేరు ప్రచారంలో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమావాళ్లకు రాజకీయాలు ఎందుకు? పవన్‌ కళ్యాణ్‌పై ముద్రగడ సెటైర్లు