పిల్లల ముందు వాగ్వివాదానికి దిగొద్దు.. కుంగుబాటు తప్పదు బీ కేర్ ఫుల్..
తల్లిదండ్రులు పిల్లల ముందు వాగ్వివాదానికి దిగొద్దు అంటున్నారు సైకాలజిస్టులు. పేరెంట్స్ తరచూ పిల్లల ముందు గొడవకు దిగితే చిన్నారుల్లో కుంగుబాటు, మానసిక ఆందోళన పెరుగుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు
తల్లిదండ్రులు పిల్లల ముందు వాగ్వివాదానికి దిగొద్దు అంటున్నారు సైకాలజిస్టులు. పేరెంట్స్ తరచూ పిల్లల ముందు గొడవకు దిగితే చిన్నారుల్లో కుంగుబాటు, మానసిక ఆందోళన పెరుగుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లల ముందు కోపాన్ని నిగ్రహించుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుంటే.. చదువుల్లో ఏకాగ్రత కోల్పోతారు.
భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎదుటివారిపై మీ కోపాన్నీ, వారి ప్రవర్తన వల్ల ఏర్పడ్డ బాధని ఓ కాగితంపై రాయండి. వాటిని పంచుకునేందుకు ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసుకోండి. ఇందువల్ల పిల్లల ముందు బయటపడే పరిస్థితి ఎదురు కాదని గుర్తించండి.
అలాగే నిజానికి మనసులో ఉన్న ఏవో అసంతృప్తులూ, ఇంకేవో విషయాలే కోపంగా పెల్లుబుకుతాయి. పిల్లల మధ్యకి రాకముందే వాటి గురించి మాట్లాడుకోండి. సమస్య ఒక్కసారిగా పరిష్కారం కాకున్నా.. కోప్పడే ఆస్కారం తగ్గుతుంది. ఒకవేళ దానిపై కోపం ఉన్నా.. పిల్లల ముందు ఆ కాసేపైనా మౌనంగా ఉండండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలను ప్రోత్సహించే రకంగా పారెంట్స్ స్పీచ్ ఉండాలి.
వారిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు.. వారిని పట్టించుకుంటున్నామని వారికి తెలియాలి. పాఠశాలల్లో వారు చేసిన విషయాలు.. వారికి ఇష్టమైన అంశాల గురించి పారెంట్స్ మాట్లాడాలి. అలాంటప్పుడే పిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.