నోట్ల రద్దు తర్వాత క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. అనేక రకాల యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. గల్లీలో ఉండే చిన్న కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అంతా డిజిటల్ మయమైపోయింది. బ్యాంకులో డబ్బు ఉంటే చాలు.. జేబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.
కరోనా కారణంగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసే వాల్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరెన్సీతోనూ కరోనా వ్యాప్తికి అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగడంతో.. డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే దేశంలో యూపీఐ ద్వారా అక్టోబర్ నాటికి రెండు వందల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని తెలియవచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఇది నూట 14 కోట్లుగా ఉంది. ఆన్‌లైన్ లావాదేవీల్లో భారీగా పెరుగుల నమోదైనట్టు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు.
గత ఏడాదితో పోలిస్తే లావాదేవీలు 80 శాతం పెరిగాయి. అలాగే, లావాదేవీల విలువలో 101 శాతం పెరుగుదల నమోదైంది. లక్షా 91 వేల 359 కోట్ల రూపాయల నుంచి 3 లక్షల 86 వేల 106 కోట్ల రూపాయలకు పెరిగినట్టు తెలిపారు.