చైనాకు చెందిన 8 పేమెంట్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించారు. వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ట్రంప్ యాప్‌లపై నిషేధ బాణాన్ని ఎక్కుపెట్టారు.
తద్వారా బీజింగ్‌తో నెలకొన్న వివాదాలు మరింత ముదిరే వీలున్నట్లు తెలుస్తోంది. ఇక నిషేధం విధించిన జాబితాలో అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ గ్రూప్‌నకు చెందిన అలీ పే, టెన్సెంట్‌కు చెందిన వియ్‌చాట్ పేలు కూడా వున్నాయి.
ఇకపోతే... చైనా యాప్‌లపై ట్రంప్ నిషేధ ఆజ్ఞలను మంగళవారం జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ అయిన 45 రోజుల తరువాత నిషేధం అమల్లోకి వస్తుందని వాషింగ్టన్ ప్రభుత్వం పేర్కొంది.
తాజా ఆదేశాల ప్రకారం 8 చైనా యాప్‌ల ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థిక శాఖ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేసింది.
నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో అలీపే, కామ్‌స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్‌ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమేట్, వియ్‌చాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ చోటు చేసుకున్నాయి.