ఇంటర్‌కనెక్ట్ యూసేజ్‌చార్జెస్ (ఐయూసీ) రద్దును టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఏడాదిపాటు వాయిదా వేసింది. వచ్చే నెల నుంచి ఐయూసీ చార్జీలను వసూలు చేయబోమని గతంలో ప్రకటించింది. అయితే 2021 నుంచి ‘జీరో ఐయూసీ’ చార్జెస్ విధానాన్ని తీసుకొస్తామని మంగళవారం తెలిపింది. ‘‘వైర్‌లెస్ టూ వైర్‌లెస్ డొమెస్టిక్ కాల్స్‌కు టెర్మినేషన్ చార్జ్ కొనసాగుతుంది.
వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు దీనిని నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తాం. తదనంతరం చార్జీలు ఉండవు’’ అని ట్రాయ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఐయూసీ చార్జీలతో లాభం పొందుతున్న వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ట్రాయ్ నిర్ణయాన్ని సమర్థించాయి. భారీగా ఐయూసీ చెల్లిస్తున్న జియో మాత్రం వాయిదాను వ్యతిరేకించింది. జియో ప్రస్తుతం నాన్ జియో కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చొప్పున ఐయూసీ వసూలు చేస్తున్నది కూడా.
జీరో ఐయూసీపై ట్రాయ్ ఈ ఏడాది సెప్టెంబరులోనే డిస్కషన్స్ మొదలుపెట్టింది. చాలా మంది ఇప్పటికీ డేటా కాల్స్‌కు బదులు, వాయిస్ కాల్స్‌పైనే ఆధారపడుతున్నారని తెలిపింది.
వాయిస్ టారిఫ్ విషయంలో ఆపరేటర్ల మధ్య సమానత్వం కనిపించడం లేదని పేర్కొంది. వచ్చే ఏడాదినుంచి జీరో ఐయూసీ అమలు చేయాలన్న ప్రపోజల్‌పై ఆపరేటర్లంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.
ప్రస్తుతం రూల్స్ ప్రకారం ప్రతి ఔట్‌గోయింగ్ కాల్‌కు నిమిషానికి ఆరు పైసలు చొప్పున ఆపరేటర్లంతా ఐయూసీ చెల్లించాలి. కొత్త ప్రపోజల్ ప్రకారం ఔట్‌గోయింగ్ కాల్‌కు ఐయూసీ వసూలు చేసినా, ఆ డబ్బు ఆపరేటరే ఉంచుకుంటాడు. ఐయూసీపై ఆపరేటర్ల మధ్య ఒకే రకమైన అభిప్రాయం లేదు. జియో 4జీ డేటా ఆధారిత నెట్‌వర్క్ కాబట్టి కాల్స్‌కు ఎక్కువ ఖర్చు కాదని మిగతా ఆపరేటర్లు వాదిస్తున్నారు.
అయితే, తమ ఔట్‌గోయింగ్ కాల్స్ పూర్తిగా ఉచితం కాబట్టి మిగతా ఆపరేటర్ల కస్టమర్లు జియో కస్టమర్లకు మిస్డ్ కాల్స్ ఇస్తున్నారని, ఫలితంగా తమకు నష్టం వాటిల్లుతోందని జియో చెబుతోంది. ‘‘వచ్చే నెల నుంచి జీరో ఐయూసీ విధానం అమలు చేయడం సరికాదు. చాలా మంది కస్టమర్లు ఇప్పటికీ 4జీ టెక్నాలజీకి దూరంగానే ఉన్నారు. 2జీ ఫోన్లు వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఐయూసీ రద్దు చేస్తే కంపెనీల మధ్య న్యాయబద్ధమైన పోటీకి అవకాశాలు తక్కువ అవుతాయి. ఈ రంగంలోకి కొత్త కంపెనీలు రావడానికి చాలా టైం పడుతుంది. ప్రస్తుతం ఉన్న కంపెనీల మధ్య బలమైన పోటీ ఉంటే, కస్టమర్లకు తక్కువ ధరల్లో సేవలు అందుతాయి’’ అని ట్రాయ్ తెలిపింది.
ట్రాయ్ నిర్ణయాన్ని స్వాగతించిన సీఓఏఐ
జీరో ఐయూసీ అమలు ఏడాదిపాటు వాయిదా వేయడాన్ని సెల్యులూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సమర్థించింది. ఇందులో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు జియో సభ్యులు. ఏడాదికి బదులు రెండేళ్లపాటు ఐయూసీ వసూలు చేయకుంటే బాగుంటుందని, అయితే ఏడాది మినహాయింపు వల్ల టెల్కోలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు.
‘‘ఈ నెలాఖరులోపు ఈ విషయాన్ని ట్రాయ్ మరోసారి పరిశీలించాలని కోరుకుంటున్నాం. ఐయూసీ విధింపుపై కోర్టులో రెండు కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ చార్జీని లెక్కించే విధానంపై మరింత చర్చ జరగాలి’’ అని ఆయన అన్నారు. ఇదే విషయమై ఒక టెల్కో సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ టెలికాం ఆపరేటర్ల ట్రాఫిక్ మధ్య తేడాలు ఉన్నంత వరకు ఐయూసీ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ట్రాయ్ తాజా నిర్ణయం వల్ల ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు మేలు జరుగుతుందనే వాదన నిజమేనని, అయితే జియో కూడా ఐయూసీ ప్యాక్‌లు మొదలుపెట్టింది కాబట్టి అది కూడా ప్రయోజనం పొందుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. జియో కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి ఐయూసీ ప్రయోజనాలు దీనికి వర్తిస్తాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్‌కు చెందిన నితిన్ సోనీ అన్నారు.