ఈ రోజుల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. సైబర్ మోసాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే చాలా వరకు మనం జాగ్రత్తగా వుండి మన వివరాలు ఇవ్వకుండా డబ్బు పంపకుంటే దాని వల్ల ముప్పు ఏమీ లేదు. అయితే వీటిలో ఒకరకం ఎస్ఎంఎస్, వాట్సాప్, మెయిల్స్ ద్వారా ఫేక్ లింక్‌లను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యుడు పసిగట్టలేని ఇలాంటి ఫేక్ లింక్ సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన గోపి అనే యువకుడు 'వెరిఫై యూఆర్‌ఎల్' (verify URL) అనే యాప్‌ను రూపొందించాడు. దీనిలో ఆరు వేలకుపైగా అధికారిక వెబ్‌సైట్ అడ్రస్‌ల జాబితాను పొందుపరచాడు.
వీటిలో ప్రభుత్వ- ప్రైవేట్ బ్యాంకులు, ప్రముఖ షాపింగ్ వెబ్సైట్లు, ప్రభుత్వరంగ వెబ్సైట్లు ఇలా అత్యధిక ప్రజాదరణ అన్ని ఇండియన్ వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా మొబైల్‌కు వచ్చే వెబ్ సైట్ (Website) అడ్రస్‌లను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. చాలా సందర్భాలలో మనకు వెబ్సైట్ అడ్రస్‌లు సరిగ్గా తెలిసినా స్పెల్లింగ్ లోపాలని గుర్తించలేక మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. కాని ఈ యాప్ సహాయంతో మీకు వచ్చిన లింక్ ఉన్న మొత్తం మెసేజ్‌ని ఈ యాప్‌లో పేస్ట్ చేసి సెర్చ్ ఆప్షన్ కొడితే కొన్ని సెకండ్స్‌లో ఆ వెబ్సైట్ అన్ని పూర్తి వివరాలు వస్తాయి. దీనిలో ఆటో లింక్ డిటెక్షన్ ఫీచర్ వుంది. అంటే మీరు లింక్ బదులు సేఫ్‌గా పూర్తి మెసేజ్ పేస్ట్ చేయవచ్చు. ఈ యాప్‌ను వాడిన ఎందరో గోపిని అభినందిస్తున్నారు.
యాప్ తయారు చేయడానికి కారణం ఏంటి?
ఈ యాప్‌ను తయారుచేయడానికి కారణం కూడా ఉందంటున్నాడు గోపి. 2010లో కొత్తగూడెంలో బీటెక్ చదివాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా అతనికి ఓ మెయిల్ వచ్చింది. మెయిల్‌కు కోటి రూపాయల లాటరీ తగిలిందని, మీరు రూ.25 వేలు చెల్లిస్తే డబ్బులు మీ ఖాతాలో పడుతాయి అంటూ వచ్చిన మెయిల్‌కు గోపి స్పందించాడు. మెయిల్ పంపిన వ్యక్తి బ్యాంకు ఖాతా నంబర్‌తో పాటు ఫోన్ నంబర్ కూడా ఇవ్వగా నమ్మకం కుదిరి రూ.కోటి వస్తాయనే భావనతో గోపి రూ.25 వేలు ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే డబ్బు తీసుకునేందుకు ముంబై రావాలని సూచించాడు. తర్వాత ముంబయి ఎలా వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్న గోపి మరుసటి రోజు పలుమార్లు సదరు వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. తీరా చూస్తే తాను మోసపోయానని గమనించాడు. అయితే ఈ మధ్య కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాల తీవ్రత చూసి తనలాగా ఇంకెవ్వరూ మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ వెరిఫై యూఆర్‌ఎల్ అనే యాప్‌ను తీసుకువచ్చినట్లు చెబుతున్నాడు.
అయితే మన మొబైల్స్‌కు, ఇమెయిల్స్‌కు ఆఫర్ల పేరుతో లేదా అర్జెంట్ మీ వివరాలు అప్డేట్ చేయాలని పేరుతో లేదా బిల్లులు చెల్లించాలని పేరుతో చాలా రకాల వెబ్సైట్ లింక్‌లు ఉన్న మెసేజ్‌లతో వస్తుంటాయి. ఇలాంటి తెలియని లింకులను క్లిక్ చేస్తే ఇక అంతేసంగతి. మన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలన్ని హ్యాకర్ చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది తర్వాత బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. అయితే మన ఫోన్‌కు వచ్చిన ఆ వెబ్‌సైట్ నిజమైనదా? నకిలీదా? తెలుసుకునేందుకు గోపీ రూపొందించిన ఈ 'వెరిఫై యూఆర్‌ఎల్' యాప్ ఉపయోగపడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి పొంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులే కాక ప్రముఖ షాపింగ్ వెబ్సైట్లు, అన్ని రాష్ట్రాల అధికార వైబ్‌సైట్లు ఇలా 6 వేలకుపైగా వెబ్సైట్ అడ్రస్లు యాప్‌లో నిక్షిప్తం చేశాడు. మొబైల్ ప్లేస్టోర్‌కు వెళ్లి వెరిఫై యూఆర్‌ఎల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, అందులో మన మొబైల్‌కు వచ్చిన వెబ్‌సైట్ ఐడీ ఉన్న మేసేజ్‌ని కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెర్చ్ కొడితే మీరు వెతికే వైబ్‌పైట్ అసలైనదా.. లేదా అనేది ఇట్టే తెలిసిపోతుంది.
ఆన్లైన్లో మామూలుగా ఈ ప్రక్రియ కోసం మనకు 2 నిముషాలు సమయం పడుతుంది. ఇలాంటి ప్రక్రియను గోపి కేవలం 10 సెకండ్స్ కుదించాడు. అలాగే సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో కలర్స్‌తో కూడిన రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఎలా అంటే గ్రీన్ కలర్ వస్తే సేఫ్ వెబ్సైట్ అనీ అలాగే రెడ్ కలర్ వస్తె అలర్ట్‌గా ఉండాలని సూచిస్తాడు. ఇలా సేఫ్టీతో పాటు సులువుగా ఉండటంతో అందరు ఈ యాప్‌ను రోజు వాడటంతో పాటు, యాప్ తయారు చేసిన గోపీని అభినందిస్తున్నారు. ఈ విధంగా అందరికి సహాయపడటం ద్వారా ఒక మంచి సమాజ సేవ చేసే అవకాశం తనకు వచ్చిందని అలాగే అందరి ప్రోత్సాహం ఉంటే భవిష్యత్తులో అన్ని రకాలా ఆన్లైన్ మోసాలకు ఈ యాప్ ద్వారా పరిష్కారం ఇస్తాను అని చెబుతున్నాడు.