ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో మంగళవారం జియో బిజినెస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో తాజా కొత్త సర్వీసుల ద్వారా 5 కోట్ల మంది కస్టమర్లను పొందాలని భావిస్తోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా వ్యాపార సంస్థలు లక్ష్యంగా కంపెనీ ఈ సేవలు ఆవిష్కరించింది.
జియో వీటికి మూడు రకాల సేవలు అందుబాటులో ఉంచనుంది. వాయిస్ అండ్ డేటా సర్వీసులతో కూడిన ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ ఫైబర్ కనెక్టివిటీ, డిజిటల్ సొల్యూషన్స్, డిజిటల్ సొల్యూషన్స్ అందించే డివైజెస్ అనేవి మూడు రకాల సేవలు.
అదేసమయంలో కంపెనీ జియో బిజినెస్ సర్వీసుల కింద ఏడు టారిఫ్ ప్లాన్లు కూడా లాంచ్ చేసింది. ప్రస్తుతం సూక్ష్మ స్థూల మధ్య తరహా సంస్థలు కనెక్టివిటీ, ప్రొడక్టివిటీ, ఆటోమేషన్ టూల్స్ కోసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఖర్చు చేస్తున్నాయని జియో తెలిపింది. అయితే తాము నెలకు రూ.1,000తోనే సర్వీసులు అందిస్తామని వెల్లడించింది.