ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ సేవలకు సిద్ధమవుతోంది. రిలయన్స్ జియో భారత్ లో కొద్దికాలంలోనే అగ్రగామి టెలికాం సంస్థగా ఎదిగింది. గత డిసెంబరు నాటికి జియో యూజర్ల సంఖ్య 42.1 కోట్లకు చేరింది.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 1000 నగరాల్లో జియో 5జీ సేవలను అందించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే ఆయా నగరాలకు 5జీ కవరేజి కసరత్తులు పూర్తయ్యాయని జియో తెలిపింది.
5జీ నెట్ వర్క్ ప్లానింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, రే ట్రేసింగ్ సాంకేతిక పరిజ్ఞానం, త్రీడీ మ్యాప్స్ ద్వారా ట్రయల్స్ చేపడుతున్నట్లు జియో వెల్లడించింది.
భారతదేశంలో 5G విస్తరణ కోసం అంకితమైన పరిష్కారాలపై దృష్టి పెట్టడానికి బృందాలను రూపొందించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు.ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5జీ రిలయన్స్ స్పెక్ట్రమ్ వేలం వుంటుందని తెలుస్తోంది.