కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వివిధ రంగాల్లో చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత కనిపిస్తోంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలపై కూడా ప్రభావం పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ వంటి కంపెనీ శాలరీ హైక్, ప్రమోషన్లు ఇవ్వనుంది.
గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార అనిశ్చితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తోందని ఇటీవల సలీల్ పరేఖ్ ఈటీ-నౌ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, భారత్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఏప్రిల్ నెలలో కరోనా కారణంగా శాలరీ హైక్, ప్రమోషన్లు హోల్డ్‌లో ఉంచింది. అయితే ఆ తర్వాత కొంతమంది ఉద్యోగులకు హైక్స్ విషయంలో ఊరట కల్పించింది. అప్పుడు శాలరీ హైక్స్, ప్రమోషన్లు నిలిపివేసినప్పటికీ ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని తెలిపింది.