తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరోనా వణికిస్తోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న టిటిడి ఉద్యోగస్తుల్లో చాలామంది కోలుకోక చివరకు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటివరకు అధికారికంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇంకా 300 మందికి పైగా ఉద్యోగస్తులు కోవిడ్‌తో చికిత్స పొందుతున్నారు.
టిటిడిలో మొత్తం పర్మినెంట్ ఉద్యోగులు 8వేలకు పైగా ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు 7వేల మందికి పైగా ఉన్నారు. ఇందులో సుమారు 800 మంది దాకా కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే అందులో సగానికిపైగా కోలుకొని తిరిగి విధుల్లోకి హాజరయ్యారు.
కానీ మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా మరో ఇద్దరు ఉద్యోగులు మృత్యు వాత పడ్డారు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో ఎఈఈఓగా పనిచేస్తున్న గురుమూర్తి, పబ్లికేషన్ విభాగంలో అటెండర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌లు ఇద్దరూ మృత్యుపడ్డారు.
గతంలో అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా వీరు మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే టిటిడి ఉద్యోగస్తులు మరణిస్తుండటం మాత్రం సహచర ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల మృతిపై టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.