కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలపై టెక్ కం సోషల్ మీడియా దిగ్గజాలు దిగి వచ్చాయి. ఈ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ వివరాలతో కూడిన నివేదిక సమర్పించారు. అయితే.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. ఈ నిబంధనలు పాటించడం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇప్పటి వరకు ఐటీ నిబంధనల అమలుకు ఒక అధికారిని నియమించిన వివరాలను ట్విట్టర్ తమకు సమర్పించలేదని ఐటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఒక న్యాయవాదిని ఫిర్యాదుల అధికారిగా పేర్కొన్నదని సమాచారం.
ఐటీ నిబంధనల అమలుకు తీసుకోకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని అన్ని సోషల్ మీడియా వేదికలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 25 నుంచి నూతన ఐటీ నిబంధనలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
నూతన ఐటీ నిబంధనలు ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తాయని ట్విట్టర్ గురువారం ఆరోపించింది. అలాగే తమ సిబ్బంది సేఫ్టీకి ముప్పు ఉందని, వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ట్విట్టర్ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం ఘాటుగా స్పందించింది. కేంద్ర చట్టాలను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతుందని, తమకే పాఠాలు చెప్పేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తుందని మండి పడింది.